బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?

Brexit-story

ప్రపంచాన్ని కుదిపేసిన ఓ పదం.. బ్రెగ్జిట్. ప్రపంచాన్ని వణికించిన ఓ రెఫరెండం.. బ్రెగ్జిట్. ప్రపంచ మార్కెట్ ను ఒక్కసారిగా కూల్చింది.. బ్రెగ్జిట్. యరోపియన్ యూనియన్ తో బ్రిటన్ తెగతెంపులకు వాడిన పదం.. బ్రెగ్జిట్. ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్న మాట బ్రెగ్జిట్(BrExit – Britain Exit). అసలు ఏంటీ బ్రెగ్జిట్.. అంతలా ప్రపంచం మొత్తం దీని మీద ఎందుకు చర్చించుకుంటోంది..? అనే అన్ని ప్రశ్నలకు పూర్తి సమాధానం ఈ ఆర్టికల్. యూరోపియన్ యూనియన్ దగ్గరి నుండి బ్రెగ్జిట్ వరకు, ఇటలీ నుండి స్విట్జర్లాండ్ వరకు అన్ని అంశాలను అందిస్తున్నా…

ఐరోపాలో ప్రత్యేక గుర్తింపు ఉన్న దేశం బ్రిటన్. కానీ అలాంటి బ్రిటన్ కు యూరోపియన్ యూనియన్ అనే ఓ కూటమిలో గుర్తింపులేకుండా పోయింది. ముందు నుండి కూడా ఈ కూటమిలో ఉండి గుంపులో గోవిందయ్యలా ఉండటం కన్నా స్వతంత్రంగా గుర్తింపు తెచ్చుకోవాలని చాలా మంది అనుకున్నారు. యూరోపియన్ యూనియన్ అనే కూటమిలో 27 దేశాలతో పాటు బ్రిటన్ కూడా ఒకటి. యూరోపియన్ యూనియన్ లో చేరితే.. వారి కరెన్సీ అన్ని దేశాలకు ఒకటిగా యూరో ఉంటుంది, ఈ కూటమిలోని దేశాలు ఏ దేశంతో అయినా స్వేచ్ఛగా వ్యాపారాన్ని చేసుకోవచ్చు. అలాగే ఏ దేశ పౌరుడైనా సభ్య దేశాల్లో స్వేచ్ఛగా ఉద్యోగం, వ్యాపారం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవే వెసలుబాటులు బ్రిటన్ ను ఈయూ నుండి దూరం చేశాయి.

బ్రిటన్‌ ఇయు సభ్య దేశంగా మారడంతో, తూర్పు ఐరోపా దేశాల నుంచి బ్రిటన్‌కు వచ్చే వలసలకు అడ్డుకట్ట తెగి పోయింది. ఈ ఒప్పందాన్ని ఆసరాగా చేసుకుని తూర్పు ఐరోపా దేశాలకు చెందిన అనేక మంది బ్రిటన్‌కు క్యూ కడుతున్నారు. బ్రిటన్‌ ప్రస్తుత జనాభాలో 21.5 లక్షల మంది వలస ప్రజలే. దీంతో బ్రిటన్‌లో జీతాల పెరుగుదల వృద్ధి రేటు పడిపోయింది. ప్రత్యేక గుర్తింపుతోపాటు తమ ఉద్యోగ అవకాశాలనూ దెబ్బతీస్తున్న ఇయుకి గుడ్‌బై చెప్పడమే మంచిదన్న వాదనకు పేద, మధ్యతరగతి బ్రిటిష్‌ ప్రజల్లోనూ మద్దతు పెరిగి పోయింది.

బ్రిటెన్ తప్పుకుంటే లాభమా..? నష్టమా..?

యూరోయన్ యూనియన్ కూటమి నుండి బయటకు వస్తే తమకే లాభం అని చాలా మంది బ్రిటన్ వాసుల అభిప్రాయం. అందుకే వారు ఈయూలో కొనసాగడానికి వీలులేదు అని తీర్పును ఇచ్చారు. అలా చెయ్యడం వల్ల తమ దేశానికి ఆర్థిక స్వావలంబన లభిస్తుందని భావిస్తున్నారు. స్వేచ్ఛా అర్థిక విధానాలతో పుంజుకోవచ్చని భావిస్తున్నారు. వలసల పోటు తగ్గి, తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు తమ దేశ ప్రత్యేక సాంస్కృతిక విలువలూ నిలబడతాయని బ్రిటెన్ ప్రజలు భావిస్తున్నారు.  ఈయు నుంచి తప్పుకున్నా జిడిపి వృద్ది రేటుకు ఎలాంటి ఢోకా ఉండదంటున్నారు. 2030 నాటికి జిడిపి వృద్ధి రేటు ప్రస్తుతం ఉన్నదానికంటే మరో 1.6 శాతం పెరుగుతుందని లెక్కలు గట్టి మరీ చెబుతున్నారు.

అయితే బ్రెగ్జిట్ వ్యతిరేకులు మాత్రం, ఇయు నుంచి తప్పుకుంటే బ్రిటెన్ కు తీవ్ర పరిణామాలు తప్పవని హచ్చరిస్తున్నారు. బ్రిటెన్ మరింత అర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం తప్పదని, మరోలా చెప్పాలంటే ఆర్థిక వినాశనం  తప్పదని అంటున్నారు. జిడిపి వృద్ధి రేటులో రెండు నుంచి ఏడు శాతానికి గండి పడుతుందని ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ పత్రిక ఇప్పటికే హెచ్చరించింది. జార్జ్‌ సోరస్‌ వంటి ప్రఖ్యాత ఇన్వెస్టర్లయితే బ్రెగ్జిట్‌ ఖాయమైతే…. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదం తప్పదని హెచ్చరించారు. అదే జరిగితే డాలర్‌తో బ్రిటిష్‌ కరెన్సీ పౌండ్‌ స్టెర్లింగ్‌ మారకం రేటు 20 శాతానికి మించి పడిపోయే ప్రమాదం ఉందన్నారు.

బ్రిటన్‌ విదేశీ వాణిజ్యంలో సగం ఈయు దేశాలతోనే జరుగుతోంది. బ్రిటన్‌కు అందే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఎక్కువ భాగం ఇయు దేశాల నుంచే వస్తోంది. లండన్‌ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా ఎదగడానికీ ఇయు సభ్యత్వం ఎంతో దోహదం చేసింది. ఈ లాభాలన్నీ కొనసాగుతాయి. గుడ్డిగా ఇయు నుంచి తప్పుకుంటే ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్‌ తప్పదని బ్రెగ్జిట్‌ వ్యతిరేకులు హెచ్చరిస్తున్నారు. ప్రధాని కామెరూన్‌తో సహా ప్రధాన బ్రిటిష్‌ రాజకీయ నాయకులు కూడా, బ్రిటన్‌కు ఇయు సభ్యత్వం అద్భుత అవకాశం అని కాకుండా, ఆర్థిక అవసరం అని మాత్రమే చెప్పడం విశేషం.

వ్యతిరేకత ఎందుకు..?
యూరోపియన్ యూనియన్ లో చేరిక నుంచి బ్రిటన్ వాసుల్లో కొంత అందోళన రగులుతూనే వుంది. పేరుకు యూరోప్ లో భాగమైనా బ్రిటన్‌ ఎపుడూ మిగతా యూరప్‌ దేశాలతో పెద్దగా కలిసింది లేదు. ఇండస్ట్రియల్ రివెల్యూషన్ సమయంలో ఆసియా, ఆఫ్రికా దేశాల్లో వలసల స్థాపన కోసం మిగతా యూరప్‌ దేశాలతోనే పోటీ పడింది. యుద్ధాలకూ దిగింది. 1957లో ప్రస్తుత ఇయుకు ప్రతి రూపమైన యూరోపియన్‌ ఎకనామిక్‌ కమ్యూనిటీ (ఇఇసి) ఏర్పడినపుడు కూడా అందులో సభ్యత్వం కోసం బ్రిటన్‌ ఆసక్తి చూపలేదు. సుమారుగా 26 ఏళ్ల తరువాత 1973లోనే సభ్యత్వం తీసుకుంది. అయితే తాము తీసుకున్న నిర్ణయం కరెక్టా..? లేదా అన్న విషయమై పున:సమీక్షించుకుంది.

అంటే ఆ తర్వాత రెండేళ్లకే యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీలో ఉండాలా? వద్దా? అన్న విషయమై రిఫరెండం జరిపింది. 67 శాతం మంది అనుకూలంగా ఓటేయడంతో ఆ వివాదానికి తెరపడింది. ఇటీవల సభ్య దేశాలపై ఇయు పెత్తనం ముఖ్యంగా ఆర్థిక, వలసల విషయాల్లో బాగా పెరిగి పోయింది. దీనికి తోడు తరచూ తలెత్తుతున్న ఆర్థిక సంక్షోభాలతో ఇయు పరువు గంగలో కలుస్తోంది. ఇష్టమున్నా లేకపోయినా సంక్షోభాల్లో చిక్కుకున్న దేశాల ఆర్థిక భారాన్ని సభ్య దేశాలూ మోయాల్సి వస్తోంది. బ్రిటన్‌ పౌరులకు ఇది ఏ మాత్రం మింగుడు పడడం లేదు. ఇవన్నీ ఇయు నుంచి బ్రిటన్‌ తప్పుకోవాలనే వాదనకు ఊతం ఇస్తున్నాయి.

అయితే తాజాగా గ్రీకు ఆర్థిక సంక్షోభం యూరోపియన్ యూనియన్ కు కుదిపేసింది. దీని నుంచి ఎలాగోలా బయటపడ్డామని యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న తరుణంలోనే సిరియా రాజకీయ సంక్షోభంతో వలస వచ్చిన వారి సమస్య తలెత్తింది. వీటిల్లో ఏ సంక్షోభాన్నీ ఈయు సమర్థవంతంగా ఎదుర్కోలేక పోయింది. వరుస పెట్టి ఎదురవుతున్న సంక్షోభాలతో ఈయు ఇప్పటికే బీటలు వారింది. ఇలాంటి పరిస్థితిలో మునిగిపోయే నావను పట్టుకుని వేలాడడం కంటే, వీలైనంత త్వరగా బయట పడి, మన దారి మనం చూసుకోవడం మంచిదని బ్రిటిష్‌ ఓటర్లు రెఫరండం ఇచ్చారు.

ఏం జరగబోతోంది..

బ్రెగ్జిట్ నేపథ్యంలో తాము యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడానికి బ్రిటన్ దరఖాస్తు సమర్పించనుంది. ఈ వ్యవహారం మొత్తం పూర్తయ్యేందుకు రెండేళ్లు పట్టవచ్చునంట. అయితే, బ్రెగ్జిట్ ఫలితం బ్రిటన్, యూరోపియన్ యూనియన్ ఆర్థిక వ్యవస్థ పైన, ఇతర రంగాల పైన బాగానే ఉండనుంది.ఈయూ నుంచి వైదొలుగుతున్న నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ నిబంధనలు బ్రిటన్‌కు వర్తించవు. ప్రజల అప్పు అరవై శాతం దాటకూడదని, జీడీపీలో మూడు శాతానికి మించి బడ్జెట్ లోటు ఉండవద్దని తదితర నిబంధనలు వర్తించవు. బ్రిటన్ విడిపోయేందుకు రెండేళ్ల గడువు ఉంటుంది. బ్రిటన్ సంస్థలు ఈయూలో స్వేచ్ఛా వ్యాపారాన్ని కోల్పోనున్నాయి. ఇతర దేశాల బ్యాంకులు లండన్ వదిలి యూరప్ దేశాలకు తరలి వెళ్తాయి. బ్రిటన్ విద్యుత్ ఇబ్బందులను ఎదుర్కోనుంది. యూఈ నుంచి విడిపోయిన నేపథ్యంలో తమకు లండన్ పైన పెద్ద ఆసక్తి లేదని అమెరికా ఇప్పటికే చెప్పింది.

ఈయూ ఆర్ధిక వ్యవస్ధలో 80 శాతం వాటా సేవల రంగానిదే. అందులోనూ 40 శాతం వాటా బ్రిటన్‌దే. ఒక్క లండన్‌లోనే లక్షకు పైగా సంస్ధలు ఈయూ వ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. బ్రిటన్ తాజా నిర్ణయంతో ఈ సంస్ధలు ఐరోపా కూటమిలోని ప్రయోజనాలను పొందేందుకు గాను ఫ్రాంక్ ఫర్డ్, పారిస్‌కు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఈ పరిణామాలన్నీ కూడా బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధను తీవ్రంగా దెబ్బతీసే ఆవకాశం ఉంది. బ్రెగ్జిట్ నిర్ణయం మాంద్యం దిశగా సాగితే ప్రపంచ వృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతుంది. దీనిని ముందుగానే ఊహించాయి కాబట్టే ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్ సహా బ్రిటన్ లోని ఇతర బ్యాంకులన్నీ బ్రగ్జిట్ ను తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ ప్రజలు మాత్రం బ్రెగ్జిట్‌కే మద్దతు తెలపడం విశేషం.

ఈయూలో చీలికలు
ఈయులో జర్మనీ తర్వాత బ్రిటన్‌ రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ. స్వల్పకాలంలో మాత్రం బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థకు కష్టాలు తప్పేలా లేవు. బ్రెగ్జిట్‌తో బ్రిటన్‌కు ఈయు దేశాల స్వేచ్ఛా మార్కెట్‌ చెక్ పడుతుంది. ఈయు దేశాల నుంచి బ్రిటన్‌కు వచ్చే పెట్టుబడులకు గండిపడనుంది. ఈయు దేశాలకు బ్రిటన్‌ నుంచి జరిగే ఎగుమతులపై పన్నుల భారం పడనుంది.  ఎగుమతులూ దెబ్బతినే ప్రమాదం ఉంది. దీని ఫలితంగా మరో వివాదం తలెతున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్ తరహాలోనే మరో దేశం కూడా అడుగులు వేస్తోంది.  బ్రిగ్జిట్ స్పూర్తితో స్వెగ్జిట్.. ఇయు విచ్చిన్నం..ఈయూలో జర్మనీ తరువాత రెండో అతిపెద్ద దేశం బ్రిటెన్ విడిపోవాలని అక్కడి ప్రజలు తీర్పునిచ్చిన తరువాత అదే స్పూర్తితో మూడో అతి పెద్ద దేశం స్విడన్ కూడా స్వెగ్జిట్(స్విడన్+ఎగ్జిట్) నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది.

గురు, శుక్రవారాల్లో ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన ఓటింగ్ లో స్విడిష్ ప్రజలు ఈయూ నుంచి వైదొలగేందుకే మొగ్గుచూపారు. నిజానికి నిన్నమొన్నటి వరకు కూడా స్విడన్ లో ఈయూ నుంచి వైదొలగాలన్న భావన లేకుండేది. ఎప్పుడైతే కల్లోలిత మధ్య ఆసియా దేశాల నుంచి శరణార్థులు రాక పెరిగిందో.. అప్పటి నుంచి వారి ఆలోచనా విధానం మారింది.  ఈయూ నంచి విడిపోతే తప్ప శరణార్థి సమస్యలను పరిష్కారం దొరకదనే అభిప్రాయానికి వస్తోన్నారు స్విడిష్ లు. బ్రిగ్జిట్ విషయంలో బ్రిటిషర్లు చెబుతున్న కారణాన్నే స్విడిష్ లు కూడా చెబుతున్నారు.  ఇది కాకుండా మరో కారణాన్ని కూడా చెబుతోంది స్వీడన్. అదే  ‘బ్రెసిల్స్ పెత్తనం’. స్విడన్ కు సంబంధించిన కీలక నిర్ణయాలు స్టాక్ హోమ్ (స్విడన్ రాజధాని)లో కాకుండా బ్రెసిల్స్ నుంచి వెలువడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, ఈయూలో ఉండటం వల్ల నష్టమేతప్ప లాభం లేదని, ఈయూలో ఉన్నందుకే శరణార్థుల బాధ్యతలను బలవంతంగా తలకెత్తుకోవాల్సి వస్తోందని ఓటింగ్ లో పాల్గొన్న స్విడిష్ లు అంటున్నారు.

టీఎన్ఎస్ సిఫో సంస్థ నిర్వహించిన పోలింగ్ లో 36 శాతం మంది స్విడిష్ లు ఈయూ నుంచి వైదొలకేందుకు ఓటు వేయగా, 32 శాతం మంది ఈయూలో కొనసాగేందుకు మద్దతు పలికారు. మిగిలిన 32 శాతం మంది ఏమీ తెలియదని చెప్పారు. బ్రిటన్ లో ఈయూ నుంచి వైదొలగాలన్న వాదన ఊపందుకోవడంలో రాజకీయ పక్షాలు కీలక పాత్ర పోశించాయి. అదే స్విడన్ లో ఈ ఉద్యమంలోకి ఇంకా రాజకీయ శక్తులు ప్రవేశించలేదు. ఒకవేళ ప్రవేశిస్తేగనుక సెగ్జిట్ నిర్ణయానికి విపరీతమైన మద్దతు లభించే అవకాశం ఉంది. స్విడన్ కాకుండా ఈయూ సభ్యులైన బల్గేరియా, హంగరీ, రొమేనియా, పోలండ్, గ్రీస్, ఆస్ట్రియా వంటి దేశాలు శరణార్థి సంక్షోభాన్ని చవిచూస్తున్నాయి.

అదే బాటలో డెన్మార్క్, ఇటలీ..
బ్రిటన్ ప్రజల చారిత్రాత్మక విజయం యూరోపియన్ యూనియన్ స్వరూపాన్నే మార్చేయనుందని బ్రిటన్ నేత, నైజిల్ పరాగే వ్యాఖ్యానించారు. బ్రిటన్ వాసుల మాదిరిగానే కూటమిలోని పలు దేశాల ప్రజలు వైదొలగాలని భావిస్తున్నారని, వారంతా ఇక ఉద్యమిస్తారని అన్నారు. తమ వెంట నడిచే తొలి దేశంగా డెన్మార్క్ నిలుస్తుందని, ఇక అక్కడ ‘డ్రెగ్జిట్’ (డెన్మార్క్ ఎగ్జిట్) ప్రచారం ఊపందుకుంటుందని, దాని వెనుకే ఇగ్జిట్ (ఇటలీ ఎగ్జిట్) తెరపైకి వస్తుందని అన్నారు. వీటితో పాటు స్వీడన్, ఆస్ట్రియాలు సైతం కూటమిని వీడుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయూ ఇక మరణశయ్య మీదకు చేరినట్టేనని అన్నారు.

ఇకపై కూడా యూరప్ దేశాలన్నీ కలిసి వ్యాపారం చేసుకోవచ్చని, అభివృద్ధి దిశగా ఒకరి కొకరు సాయం చేసుకుంటూ ముందుకు సాగవచ్చని అన్నారు. ఇరుగుపొరుగు దేశాలుగా, స్నేహితులుగా కలిసే వుందామని అన్నారు. ఇక ప్రజల ఆకాంక్ష మేరకు ఈయూ నుంచి బయటకు రావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆ దిశగా వారు అడుగులు వేయకుంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ప్రజల నుంచి చారిత్రాత్మక తీర్పును అందుకున్న జూన్ 23ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని నైజిల్ పరాగే డిమాండ్ చేశారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s