ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?

Terror

ఓ పాతికేళ్ల కుర్రాడు చచ్చిపోతే దాదాపుగా నలభై వేల మంది యువకులు అతడి అంతిమ సంస్కారానికి హాజరయ్యారు. మరో వ్యక్తి చనిపోతే… హైదరాబాద్ లో దాదాపుగా ఇరవై వేల మంది అతడి అంతిమ యాత్రలో పాలుపంచుకున్నారు. అయితే ఇక్కడ చనిపోయింది ఎవరో దేశభక్తులు అని అనుకుంటున్నారేమో.. దేశంలో అరాచకం చేసి.. రక్తం పారించడం వారి ఉద్దేశం. గతంలో హైదరాబాద్ వరంగల్ హైవేపై వికారుద్దీన్ అనే ఓ ఉగ్రవాదిని పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తే.. అతడి చావుకు వేల మంది సంతాపాన్ని ప్రకటించి.. అంతిమ సంస్కారాలకు హాజరయ్యారు. తాజాగా జమ్ము కాశ్మీర్ లో కూడా అదే పరిస్థితి. బుర్హాన్ వనీ అనే ఓ పాతికేళ్ల కుర్రాడు తుపాకీ చేతపట్టి అరాచకానికి పాల్పడే వాడు. అతడి తలపై ప్రభుత్వం రివార్డు కూడా ప్రకటించింది. అలాంటి వ్యక్తిని పోలీసులు చంపేస్తే.. దానిపై చాలా మంది భిన్నంగా స్పందిస్తున్నారు.

ఇలా ఉగ్రవాదులను ఉగ్రవాదులుగా కాకుండా పలానా అనే ఓ మతానికి ఆపాదించడం వల్లే ఇది జరుగుతోంది అన్నది నిజం. ఎందుకంటే ఇలా చనిపోయిన ఉగ్రవాదిని సమర్థిస్తూ… ఓవైసీ లాంటి నాయకులు ఏదో ప్రకటన చేస్తారు. కేవలం అతడు పలానా మతానికి చెందడం వల్లే ప్రభుత్వం అతడిని చంపేసింది అని పరుష వ్యాఖ్యలు చేస్తారు. దాంతో ముందు నుండి ఎక్కడో మన మతానికి చెందిన వాడు అనే భావన మరింత బలపడుతుంది. ఇంకేముంది మన వాడు చనిపోతే.. చంపేస్తే కనీసం మద్దతు కూడా ఇవ్వరా అనే  పరిస్థితులు కల్పిస్తారు.

అసలు ఇదంతా ఎక్కడ వచ్చింది అంటే ఖచ్చితంగా మతం దగ్గరి నుండే వచ్చింది. మతం ముసుగులో అతడు అంతకు ముందు చేసిన మారణహోమాన్ని మరుస్తున్నారు. నాయకుల ప్రభావమో లేదంటే మీడియా ప్రభావమో కానీ ఇది అంతకంతకు పెరుగుతోంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే గతంలో అదే మతానికి చెందిన వాళ్లే వాళ్ల ప్రార్థనా స్థలాల్లో బాంబులు పెట్టి పేల్చారు. బాంబు పేలుళ్లలో అదే మతానికి చెందిన వాళ్లు రక్తం చిందారు. మరి అలాంటి వాళ్లకు మద్దతు ఎందుకు పలుకుతున్నారు.

మతంలో ఎక్కడ కూడా మారణహోమం చెయ్యమని ఉండదు. అన్ని మతాల సారాంశం ఒక్కటే.. మనిషిని ప్రేమించు.. వాడికి సహాయం చెయ్యి.  మతం పేరుతో మారణహోమం చెయ్యమని ఏ మతంలో కూడా లేదు. మతంలోని లేని దాన్ని మనుషుల మీద రుద్ది వాళ్లను మానవ మృగాలుగా మారుస్తున్నారు. అయినా బుర్హాన్ లాంటి వ్యక్తి చనిపోతే.. అంత మంది ర్యాలీగా వచ్చి మద్దతు తెలపాల్సిన అవసరం ఏముంది.? వికారుద్దీన్ లాంటి ఉగ్రవాదిని చంపేస్తే.. దానిపై నాయకులు అంతలా గొంతు చించుకోవాల్సిన అవసరం ఏముంది..? అన్నింటికి మించి మతానికి, ఉగ్రవాదానికి ఎలాంటి సంబందం లేదు అని ప్రకటనలు చేసే ఓవైసీ లాంటి వాళ్లు ఇలాంటి ఘటనలకు ఎందుకు మద్దతు పలుకుతున్నారు..?

ఇలా ఉగ్రవాదులకు మద్దతు ప్రకటించడం వల్ల ఉగ్రవాదులు హీరోలు మారుతున్నారు. నిజానికి కాశ్మీర్ లో బుర్హాన్ ను చంపేసిన పోలీసుల శౌర్యం గురించి ఏ మీడియాలో వార్తలు రావు. కానీ అదే ఉగ్రవాదికి మద్దతు పలుకుతూ వచ్చే ప్రకటన మీద మాత్రం ఏకంగా చర్చలు పెడతారు. ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు పలుకుతూ మీడియా చేసే వ్యభిచారాన్ని దేశంలో ఎవరూ ప్రశ్నించరు.ఉగ్రవాదం అనేది మతానికి సంబందం లేని అంశం అనే వాళ్లకు ఓ ప్రశ్న. ఉగ్రదాడులు జరిగిన తర్వాత లేదంటే ఉగ్రవాదం అనే మాట వినిపించిన ప్రతీసారి.. ఉగ్రవాదాన్ని, మతంలో ముడిపెట్టకండి అని ప్రకటించే వాళ్లు.. అదే ఉగ్రవాదులు చనిపోతే లేదంటే చంపేస్తే వేల మంది బహిరంగంగా మద్దతు తెలుపుతుంటే మాత్రం ఎందుకు మౌనంగా ఉంటారు..?

ఉగ్రవాదులు మారణహోమాన్ని చేస్తున్న ప్రతీసారి అన్ని మతాలకు చెందిన వాళ్లు మరణిస్తున్నారు. కానీ అదే ఉగ్రవాది చనిపోతే మాత్రం ఓ మతానికి చెందిన వాళ్లను రెచ్చగొట్టి మద్దతు సమీకరిస్తున్నారు. ఉగ్రవాది చనిపోతే వాడికి మద్దతు పలకడమే కాకుండా అంతిమ సంస్కారాలు పూర్తి కాగానే.. రాళ్లు రువ్వడం, కనిపించిన ప్రతి వస్తువును తగలబెట్టడం చేస్తున్నారు. శుక్రవారం ప్రార్థనలు ముగియగానే.. బయటకు వచ్చి రోడ్ల మీద బీభత్సం చేస్తున్నారు. మరి వీటిపైన ఎందుకు  నాయకులు నోరువిప్పరు. ఎందుకంటే వారికి కేవలం తమ వాళ్ల ఓటు బ్యాంకు ముఖ్యం అంతే తప్ప అందరి సంక్షేమం అవసరం లేదు. అన్నింటికి మించి అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్లుంటే ఇలాంటి మతపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు.. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి.