తెలుగు వీర లేవరా.. ఢిల్లీలో చక్రం తిప్పరా

Vijayawada: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu during a programme in Vijayawada on Feb 23, 2018. (Photo: IANS)

దేశ రాజకీయాల్లో కీలక నేతలుగా తెలుగు చంద్రులు మారుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఢిల్లీలోని రాజకీయాలను శాసించగలమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు సిద్ధమయ్యారు. రాష్ట్రాలకు అధికారాలు కావాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ముందుకు వస్తే.. బీజేపీ అంతం కోసం మహాకూటమిలో భాగంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఎవరి కూటమి విజయవంతమైనా అది తెలుగు వారికి గర్వకారణమే అవుతుంది.

ముందు నుండి దక్షిణాది రాష్ట్రాల్లో మంచి పేరున్న నేతగా చంద్రబాబు నాయుడు.. బీజేపీయేతర కూటమిలో చురుగ్గా ఉంటున్నారు. యూపీలో అఖిలేష్ యాదవ్, కర్ణాటకలో కుమారస్వామి, పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ, జమ్మూకాశ్మీర్‌లో ఒమర్ అబ్దుల్లాలాంటి ఎంతో మందిని ఒకే తాటిపైకి తెచ్చి వారి మద్దతుతో దూసుకెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అంతంత మాత్రం మెజార్టీ వస్తే మాత్రం చంద్రబాబు కూటమి కీలకం కానుంది.

మరోపక్క రాష్ట్రాల మీద కేంద్రం బోడిపెత్తనం ఏంటంటూ కేసీఆర్ ఢిల్లీ వైపు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలను కలిసిన ఆయన.. తన ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతు కూడగడుతున్నారు. మొండితనం, రాజకీయ చతురత ఉన్న కేసీఆర్.. సందర్భోచితంగా వ్యవహరించి దేన్నైనా సాధిస్తారు అనే వారి మాటలో నిజం ఉంది కాబట్టి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తుతానికి అంతలా సక్సెస్ అయినట్లు కనిపించకపోయినా ముందు ముందు రాష్ట్రాల నుండి మంచి మద్దతు లభించే అవకాశముంది.

మొత్తంగా ఢిల్లీ రాజకీయాలను ఖచ్చితంగా ప్రభావితం చేసే శక్తి తెలుగు సీఎంలకు ఉందన్న మాటను అందరూ ఒప్పుకోవాల్సిందే. ‘తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా’ అనే లిరిక్ ఇప్పుడు ఇద్దరు చంద్రులకు అబ్బుతుంది. కాగా ఎవరి చంద్రకాంతి ఢిల్లీలో వెన్నెల పూయిస్తుందో ఎన్నికల్లో తేలనుంది.

నాగ సాధువులు ఎవరు? వాళ్ల పుట్టుపూర్వత్తరాలు ఏంటి?

కుంభమేళా, అర్ధకుంభమేళాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే నాగ సాధవుల గురించి ఎన్నో చిక్కని ప్రశ్నలున్నాయి. అసలు నాగ సాధవులు ఎవరు? ఎక్కడ ఉంటారు? వారు ఎందుకు ఏర్పడ్డారు? అనే ఎన్నో ప్రశ్నలు సామాన్యులకు వస్తుంటాయి. చాలా మంది వీరిని అఘోరాలుగా భావిస్తారు కానీ అఘోరాలు వేరే, నాగ సాధవులు వేరే. నాగ సాధువుల గురించి ఎన్నో విషయాలు ఈ ఆర్టికల్‌లో..

నాగ సాధువులు ఎవరు?

08

శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్యుల కాలంలో దేశంలో బౌద్ధం బాగా ప్రాచుర్యంలో ఉండగా.. అరబ్ లు, పార్శీలు దేశంలోకి ప్రవేశించి హిందూ దేవాలయాలను, సాధువులను చంపుతుండే వారు. వారిని కట్టడి చేయడానికి అప్పటి రాజులు ఎంత ప్రయత్నించినా అది కుదిరేది కాదు. దీంతో హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన అవసరముందని గుర్తించిన ఆదిశంకరాచార్యులు.. ఓ వర్గాన్ని తయారు చేశారు. ఆ వర్గమే నేటి నాగ సాధువులు. మంత్రాలకు చింతకాయలు రాలనట్లే.. శాపాలు, ఆర్థనాదాల వల్ల హిందూ ధర్మం నిలబడలేదని, దాన్ని నిలబెట్టాల్సిన ధర్మం నాగ సాధువులకు అప్పగించారు.

హిందూ ధర్మాన్ని రక్షించడం పరమావధిగా వీరు జీవిస్తుండగా.. ఎప్పుడూ శివ నామస్మరణ చేస్తుంటారు. మంత్రాలతో పాటు అస్త్రశస్త్రాలను ఎలా ప్రయోగించాలో వీరి మరింత తర్ఫీదు తీసుకుని ఉంటారు. నాడు హిందూ దేవాలయ మీద జరిగే దాడిని వీరు క్రమక్రమంగా అడ్డుకుంటూ వచ్చారు. ఒకానొక సమయంలో అరబ్బుల దాడుల నుండి తమను కాపాడమని నాటి రాజులు నాగ సాధువులను వేడుకునే వారు అంటే వీరి బలం ఏంటో అర్థమవుతుంది. కేవలం వందల సంఖ్యలో.. నాగ సాధువుల బృందం వేల సంఖ్యలోని బలశాల అరబ్బుల సైన్యాన్ని ఊతకోత కోయడం చూసి నాటి పండితులు ‘ఎంతో మంది రుద్రులు రక్తంతో విలయతాండవం ఆడినట్లు ఉంది’ అని అన్నారంటే వారి పరాక్రమాలు అర్థమవుతాయి.

ఎక్కడ ఉంటారు?

నాగ సాధువులు హిమాలయాల్లో ఉంటూ నిత్యం ధ్యానంలో ఉంటారు. వీరు ఒంటి మీద నూలు పోగు లేకుండా విభూతి రాసుకుని జీవిస్తుంటారు. కాలం ఏదైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వీరు బట్టలు వేసుకోరు.. సబ్బు వాడటం, నూనె వాడటం లాంటివి వీరి జాబితాలో ఉండవు. రోజులో ఒకసారి మాత్రమే తినే సాధువులు.. రోజులో సాయంత్రం పూట కేవలం ఏడు ఇళ్లలో భిక్ష అడుగుతారు. ఏడు ఇళ్లలో ఏ కుటుంబం భిక్ష వేసినా స్వీకరిస్తారు. ఒకవేళ భిక్ష లభించకపోతే ఆ రోజు ఏమీ తీసుకోరు.

కుంభమేళాలోనే ఎలా కనిపిస్తారు?

నాగ సాధువులు కుంభమేళా జరిగే సమయంలో తప్ప ఎప్పుడూ కనిపించరు. సాధారణంగా హిమాలయాల్లో ఉండే నాగ సాధువులు కుంభమేళా సమయంలో మాత్రం అక్కడికి చేరుకుంటారు. అయితే హిమాలయాల నుండి ఎన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నా మధ్యలో ఎక్కడా వీరు తారసపడరు. కుంభమేళా ప్రారంభంలో వీరు పవిత్ర స్నానాలు పుణ్య జలాలకు మరింత పుణ్యాన్ని ఆపాదిస్తాయని చాలా మంది నమ్మకం.

గుడి వద్ద రాజకీయం మాట్లాడం తప్పా? ఒప్పా?

తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్.. విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో అమ్మవారి దర్శనం తర్వాత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఏపీ సీఎం చంద్రబాబుకు కేసీఆర్ గిఫ్టు సిద్ధం చేస్తున్నారని స్టేట్ మెంట్ ఇచ్చారు. దేవస్థానం వద్దకు వచ్చి రాజకీయాలు మాట్లాడటం ఏంటని దేవస్థాన పాలక మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై తలసాని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. నిజానికి ఈ అంశాన్ని రెండు కోణాల్లో చూడాల్సి వస్తుంది. ఒకటి రాజకీయ కోణం కాగా మరొకటి సామాన్యుడి కోణం.

11

రాజకీయ కోణంలో.. తలసాని శ్రీనివాస్ వ్యాఖ్యలు అవసరం. ఎందుకంటే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్టు ఇస్తామని కేసీఆర్ ప్రకటన చేయగా.. త్వరలో ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాన్ని కలిగిస్తాయి. అందుకే తలసాని అక్కడికి వెళ్లి స్థానిక సీఎం మీద వ్యాఖ్యలు చేశారు. అయితే పాలక మండలిలోని సభ్యుల్లో చాలా మంది టీడీపీకి చెందిన లేదా టీడీపీకి అనుకూల వ్యక్తులు ఉండటం వల్లే.. తలసాని క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ తెర మీదకు వచ్చిందనే వాదనలో నిజం లేకపోలేదు. తిరుమలలాంటి పుణ్య క్షేత్రాలకు వెళ్లినప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం మామూలే. నిజానికి ఇలాంటి దేవస్థానాల వద్దకు రాజకీయ నాయకులు వెళితే అక్కడికి చేరుకునే రిపోర్టర్లు కూడా రాజకీయ పరిణామాల మీదే ప్రశ్నలు అడుగుతారు.. నేతల నుండి తాము ఆశించిన సమాధానాలు రాబడతారు. కాబట్టి ఓవరాల్ గా తలసాని మాటల మీద దుమారం కేవలం రాజకీయ అవసరం మాత్రమే అని చెప్పుకోవాలి.

16

సామాన్యుడి కోణంలో.. అసలు తలసాని శ్రీనివాస్ ఒక్కడే కాదు ఎవరూ ప్రార్థనా స్థలాలు, మందిరాల వద్ద ఎలాంటి రాజకీయాలు మాట్లాడకపోవడం ఉత్తమం అనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే ప్రశాంతత కోణం వచ్చే భక్తులకు ఇలాంటివి చిరాకు తెప్పిస్తుంటాయి కాబట్టి. ఇక అసెంబ్లీ నుండి టీవీ ఛానళ్ల స్టూడియోల వరకు రాజకీయ నేతలు కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి అవకాశాలుండగా.. ఇక ప్రార్థనా స్థలాల జోలికి ఎందుకు వస్తున్నారనే సామాన్యుడి ప్రశ్న.

15

మొత్తానికి దేవాలయాల్లోకి సంప్రదాయ దుస్తులు ధరించి రావాలి అని కొన్ని దేవాలయాలు నిర్ణయించినట్లు..            దేవాలయ పరిసరాల్లో రాజకీయాలు మాట్లాడకూడదు అని బోర్డులు పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు

పదండి.. పాత పద్ధతులకు

కొత్తొక వింత.. పాతొక రోత అని నానుడి. అంటే కొత్త అంటే ఎవరైనా పడి చస్తారు అదే పాత అంటే పట్టించుకోరు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పాత పద్ధతుల వైపు మరలి చూడాల్సిన అవసరం ఏర్పడుతోంది. మారిన జీవన విధానం వల్ల ఈ మార్పు తప్పని సరి అనే చెప్పుకోవాలి. పాత స్టైల్స్ దగ్గరి నుండి పాత కాలం నాటి ఆహారం వైపు జనాలు చూస్తున్నారంటే పరిస్థితి ఏంటో అందరికీ అర్థమవుతుండాలి.

పాత కాలంలో రుషులు గడ్డాలు పెంచి, జుట్టు వదిలేస్తే చాలా కాలం తర్వాత మన వాళ్లు అదే స్టైల్లో కొంచెం స్టైలిష్‌గా తయారవుతున్నారు. ఎన్నో శతాబ్దాల క్రితమే మన వాళ్లు ఎప్పుడో పెట్టిన స్టైల్.. ఇప్పుడు దాన్ని ట్రెండ్ అని ఫాలో అవుతున్నారు. విదేశాల నుండి, సోషల్ మీడియాలో కనిపించేసరికి కానీ మన వారికి మన స్టైల్ సత్తా ఏంటో తెలియడం లేదు. మరెందుకు ఆలస్యం పాత స్టైల్స్ ఏమైనా ఉంటే దాన్ని కట్టుబొట్టు దగ్గరి నుండి ఫాలో అయిపోతే మీరే ట్రెండ్ సెట్టర్ అవుతారు.

16

మారిన ఆహార విధానం వల్ల మనలో చాలా మందికి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి. సాధారణంలో మనలో చాలా మందికి బీపీ, షుగర్ ఉంటోంది. ఊర్లలో ముసలివాళ్లు ఎంత వయసు వచ్చినా వాళ్ల పనులు వారే స్వంతంగా చేసుకోగలరు కానీ సిటీలో మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు. డాక్టర్లు మాత్రం ఆయిల్(నూనె) లేకుండా చిరు ధాన్యాలు తినమని సలహానిస్తారు. పాతకాలం వారు రాగులు, జొన్నలు, తైదలు, సజ్జలు, పెసళ్లులాంటి వాటిని తిని.. అంబలి తాగి పనికి వెళ్లే వారు. ఇప్పుడు అవే ఆరోగ్యానికి మంచి అంటే జనాలు ఆయుర్వేదం షాపులకు క్యూ కడుతున్నారు. అవే చిరుధాన్యాలతో నాలుగు వెరైటీలు చేస్తే లొట్టలేసుకుని తింటున్నారు.

17

అందుకే అంటారు.. పెద్దల మాట చద్ది మూట అని. ఇక్కడ వారి మాటకు విలువ, చద్ది మూటకూ విలువే.

EBCలకు 10% రిజర్వేషన్.. రెండు కోణాలు

09

దేశం స్వాతంత్ర్య అనంతరం మొదటిసారి కుల, మత, ప్రాంతాల ఆధారంగా కాకుండా ఆర్థిక స్థితిని బట్టి రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం EBC రిజర్వేషను తెర మీదకు తెచ్చింది. EBC అంటే ఆర్థికంగా వెనకబడిన వర్గాలు(Economically Backward Class). ఇప్పటి వరకు ఎవరూ ఆలోచించని విధంగా మోదీ ఆలోచించి ఈ ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్నారంటూ బీజేపీ నేతలు జబ్బలు తరుస్తున్నారు. అయితే ఇదంతా ఎన్నికల్లో గెలిచేందుకు మోదీ వేసిన మాస్టర్ ప్లాన్ అనే వాదనలు వినిపిస్తున్నాయి.

నిజానికి మోదీ నిర్ణయాన్ని అన్ని పార్టీలు(దాదాపుగా) వ్యతిరేకించినా కూడా పార్లమెంట్ ఉభయసభల్లో మాత్రం రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఓటేశాయి. (ఒకవేళ ఓటు వేసి ఉండకపోతే మోదీ, బీజేపీ దానినే టార్గెట్ చేస్తూ 2019 ఎన్నికలకు వెళతారనే వాదన కూడా ఉందనుకోండి) లోకసభలో బిల్లు టక్కున ఆమోదం పొందడం, రాజ్యసభలో కాస్త వాదనల మధ్య ఓకే అవడం, వెంటనే రాష్ట్రపతి ఆమోదం లభించడం జరిగింది. కాగా దీనిని రాజకీయంగా, సాధారణంగా ఎలా చూడాలనే దానిపైనే చర్చ సాగుతోంది.

అనుమానం ఎందుకంటే..
> మోదీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ సమావేశాల చివరి రోజు కీలకమైన, కోట్ల మంది భవిష్యత్తుతో ముడిపడిన బిల్లును ఎందుకు ప్రవేశపెట్టారు అనేది అనుమానం
> ఎన్నికలకు ముందు ఇలాంటి బిల్లును ఎందుకు తెచ్చారు అనేది మరో డౌట్
> రాఫెల్ ఒప్పందం మీద పార్లమెంట్ ఉభయసభలు అట్టుడుకున్న వేళ.. దాన్ని తప్పించుకోవడానికే ఇలాంటి కీలక బిల్లును తెచ్చారనే దానిలో కూడా నిజం లేకపోలేదు
> మోదీ ప్రభుత్వానికి మిగిలిన బిల్లుల మీద లేని చిత్తశుద్ధి ఒక్క EBC రిజర్వేషన్ మీదే ఎందుకు.. రాజ్యాంగాన్ని సవరించే అవసరం కూడా లేని బిల్లులను ఎందుకు క్లీయర్ చేయలేదు అనేది మరో వాదన

07

08

మోదీకి ఎంత వరకు కలిసి వస్తుంది
> వచ్చే ఎన్నికల్లో.. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈబీసీ రిజర్వేషన్ కీలకంగా మారి ఓట్లు రాల్చవచ్చు
> ముందు నుండి బీజేపీ, మోదీకి అండగా ఉన్న అగ్రవర్ణ కులస్తులు ఈ నిర్ణయంతో పార్టీకి గట్టి ఓటు బ్యాంకుగా మారనున్నారు
> మోదీ ప్రభుత్వం మీదున్న వ్యతిరేకత ఒక్క రిజర్వేషన్ బిల్లుతో పోతుంది
> రిజర్వేషన్లను ఎత్తివేయాలి అని వాదించే వర్గాలు ఓ రకంగా మోదీ నిర్ణయంతో సంతృప్తి చెంది.. వచ్చే ఎన్నికల్లో దన్నుగా నిలిచే అవకాశం ఉంది

మొత్తంగా ఈబీసీ రిజర్వేషన్ మీద ఎన్ని వాదనలు ఉన్నా.. మోదీ ప్రభుత్వం ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది అనే నిజాన్ని మాత్రం అన్ని పార్టీలు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది.

కేసీఆర్ అందరి వాడు మరి కేటీఆర్ కొందరి వాడా?

ktr

తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించడంతోపాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తన అద్భుతమైన పరిపాలనతో కేసీఆర్ అందరి మన్ననలు పొందుతున్నారు. కేసీఆర్ తర్వాత ఎవరూ అనే ప్రశ్నకు సమాధానంగా కేటీఆర్ పేరు సర్వత్రా వినిపిస్తోంది. కానీ గతకొంత కాలంగా కేటీఆర్ పోకడ చూస్తుంటే ఎక్కడో కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. కేసీఆర్‌కు అన్ని వర్గాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. మరి అలాంటి క్రేజ్ కేటీఆర్‌కూ ఉందా అనే దానిపై కాస్త ఆలోచించి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేటీఆర్ ఫోకస్ మొత్తం హైదరాబాద్ మీదే ఉండిపోయింది.

తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల్లో గెలవడం వేరు… ఒక్క హైదరాబాద్‌లో గెలవడం వేరు అనే మాటలకు సమాధానంగా గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా గులాబీ జెండా రెపరెపలాడింది. అయితే ఆ ఎన్నికల బాధ్యతను మొత్తం భుజాలపై వేసుకున్న కేటీఆర్ ఒక్కసారిగా ఫాంలోకి వచ్చారు. అంతే ఆ ఎన్నికల ఫలితాల నుండి కేటీఆర్ ఒక పరిధిలో మాత్రమే ఉంటున్నారు అనేది నిజం. అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తూ వార్తల్లోకి రావడం, హైదరాబాద్ మీద కాన్ఫిరెన్సులు, జీహెచ్ఎంసీ పరిధిలో ఏదో ఒక శంఖుస్థాపనకు వెళ్లడం, తెలుగు సినీ ప్రముఖులతో ములాఖత్ లాంటి వాటితో బిజీగా మారిపోయారు.

తెలంగాణలో హరీష్ రావు, ఈటెల రాజేందర్ లాంటి సీనియర్ నాయకులు ఏ పొజీషన్‌లో ఉన్నా కూడా మాస్ ఫాలోయింగ్‌ను మాత్రం ఎక్కడా కోల్పోలేదు. కానీ కేటీఆర్ మాత్రం ఈ పాయింట్‌ను మిస్ అయ్యారనిపిస్తోంది. అసలు మాస్ ఫాలోయింగ్ ఎందుకు అవసరం? అని ఎవరికైనా అనుమానం కలుగుతుందేమో… మాస్ జనాలు ఒక్కసారి ప్రేమించడం, ఆరాధించడం మొదలుపెడితే చచ్చేదాకా వారి మైండ్ సెట్ మారదు. కానీ సిటీ జనాలు అలా కాదు.. ఏ గాలికాగొడుగు పట్టేస్తారు. కాబట్టి కనీసం ఇప్పుడైనా కేటీఆర్ కూడా తన తండ్రిలాగా ‘అందరివాడు’ అవ్వాలంటే కొన్ని విషయాల మీద దృష్టిసారించాల్సిందే.